1952: ఓటమిలో గొప్ప విజయం
1952లో భారతదేశంలో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓడిపోవడం చారిత్రాత్మక ఘటన. ఈ ఓటమిని అంబేద్కర్ సార్ధకంగా మలిచిన విధానం, ఆయన దృష్టిలో నిజమైన నాయకత్వానికి అర్థం ఏమిటనేది స్పష్టంగా తెలియజేసింది. ఆయన ఓటమి తర్వాత తనను గెలిచిన ఎస్సీ నేత బోర్కర్‌తో జరిగిన సంభాషణ సామాజిక చైతన్యానికి ఓ మార్గదర్శకం అయ్యింది.
బోర్కర్ ఆనందం – అంబేద్కర్ ప్రశ్న
ఎన్నికల ఫలితాల తర్వాత బోర్కర్ డాక్టర్ అంబేద్కర్ ఇంటికి వచ్చి మరీ “సార్, నేను గెలిచాను. చాలా సంతోషంగా ఉంది!” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో అంబేద్కర్ అతనిని ప్రశ్నించారు, “మీరు గెలిస్తే ఇప్పుడు మీరు ఏమి చేస్తారు?” అని. దీనికి బోర్కర్ స్పందన, “పార్టీ నాకు ఏం చెబితే అది చేస్తాను” అని ఇచ్చారు. ఇది వినగానే అంబేద్కర్ మౌనంగా ముస్లాడారు.
రాజ్యాంగ హక్కులు – పార్టీ విధేయత
అంబేద్కర్ మరలా ప్రశ్నించారు, “మీరు జనరల్ సీటు నుండి గెలిచారా?” బోర్కర్ “లేదు, రిజర్వ్డ్ సీటు నుండే గెలిచాను, అది మీ రాజ్యాంగం ద్వారా నాకు లభించిన హక్కుతోనే సాధ్యమైంది” అని అన్నాడు. అంబేద్కర్ గళం కలతగా మారింది. “మీరు నా రాజ్యాంగం వల్ల గెలిచారు, కానీ ఇప్పుడు పార్టీకి విధేయులైపోయారు. మీరు సమాజానికి ప్రాతినిధ్యం వహించాల్సిన సమయంలో, పార్టీలకు హరిజన నాయకులుగా మారుతున్నారు.”
నానక్‌చంద్ రత్తుతో చివరి మాటలు
బోర్కర్ వెళ్లిన తర్వాత, అంబేద్కర్ చిరునవ్వుతో ఉన్నారు. నానక్‌చంద్ రత్తు, ఆయన వ్యక్తిగత కార్యదర్శి, “సార్, మీరు ఎందుకు నవ్వుతున్నారు?” అని అడిగారు. అప్పుడు అంబేద్కర్ జవాబు గుండెను పిండేస్తుంది – “బోర్కర్ తన సమాజానికి నాయకత్వం వహించాల్సిన సమయంలో, పార్టీకి హరిజనుడయ్యాడు. ఇదే పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సమాజాన్ని మర్చిపోయి, పార్టీలకు పనివాళ్లుగా మారిపోతున్నారు.”
అంబేద్కర్ హెచ్చరిక – నేటికీ మారలేని వాస్తవం
ఈ సంభాషణ డాక్టర్ అంబేద్కర్ యొక్క సమాజపు పట్ల నిబద్ధతను, రాజకీయాలలో సామాజిక న్యాయం గురించి ఆయన కలల్ని ప్రతిబింబిస్తుంది. ఆయన చెప్పిన మాటలు నేటికీ ఎంతో ప్రాసంగికంగా మారాయి. అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతినిధులు, రిజర్వేషన్ ద్వారా గెలిచి పార్టీల మార్గదర్శనాల మేరకే నడుస్తున్నారు. తమ వర్గ సమస్యలు, హక్కుల కోసం పోరాడే ధైర్యం కోల్పోతున్నారు. అంబేద్కర్ వారిపై చేసిన విమర్శ, పార్టీకి హరిజన నాయకులుగా కాకుండా, సమాజానికి నిజమైన నాయకులుగా నిలవాలన్న ఆవేశం ఇప్పటికీ మారలేదు.

రచయిత
వాగ్మారే అభిషేక్
RPI తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి – 8688652941