జులై 1 నుంచి మారుతున్న కీలక ఆర్థిక నిబంధనలు – సామాన్యులకు భారం, కొంత ఊరట

నూతన ఆర్థిక సంవత్సరంలో జులై నెల కీలక మార్పులతో ప్రారంభం కానుంది. జులై 1 నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారనున్నాయి. రైల్వే టికెట్ల ధరలు పెరగనున్నాయి. నాన్‌ ఏసీ క్లాసుల్లో కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతుల్లో 2 పైసలు అధిక ఛార్జీగా వసూలు చేస్తారు. 500 కిమీ దాటి ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్లకు అర్ధ పైసా అదనంగా చెల్లించాలి. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఇక ఆధార్ లింక్ చేసిన ఖాతాదారులకు మాత్రమే OTP ఆధారంగా అందుబాటులో ఉంటుంది. ఏజెంట్లకు మొదటి అరగంటలో బుకింగ్‌కు అనుమతి ఉండదు. పాన్‌కార్డు కోసం దరఖాస్తులో ఆధార్ తప్పనిసరి కాగా, ఇప్పటికే ఉన్న పాన్, ఆధార్ లింకింగ్‌కు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది.

క్రెడిట్ కార్డుల బిల్లులు ఇకపై భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ఫోన్‌పే, బిల్‌డెస్క్, క్రెడ్ వంటి యాప్‌ల వినియోగంపై ప్రభావం చూపనుంది. పలు బ్యాంకులు మాత్రమే BBPSకి మద్దతిస్తుండగా, మిగతా బ్యాంకులు త్వరలో దీన్ని అమలు చేయనున్నాయి.

సీఐసీఐ బ్యాంక్ ఎటీఎంలపై లావాదేవీల పరిమితిని దాటితే, నగదు ఉపసంహరణకు రూ.23, బ్యాలెన్స్ చెకింగ్‌కు రూ.8.50 చొప్పున వసూలు చేయనున్నారు. మెట్రో నగరాల్లో మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఇదే విధంగా మార్పులు చేస్తూ పరిమితి దాటి జరిపే లావాదేవీలపై రూ.23+జీఎస్టీ వసూలు చేస్తుంది.

న్‌లైన్ గేమింగ్ చార్జీల్లోనూ మార్పులు వస్తున్నాయి. నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే వినియోగదారులపై అదనంగా 1% చార్జీ విధించనున్నారు. థర్డ్ పార్టీ వాలెట్లకు, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా రూ.10వేల కంటే ఎక్కువ బదిలీ చేస్తేనూ ఇదే విధంగా అదనపు చార్జీలు వర్తిస్తాయి.

జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్‌లో జులై 2025 నుంచి కఠిన మార్పులు అమలులోకి వస్తున్నాయి. GSTR-3B ఫారమ్‌కి సంబంధించి ఇప్పుడు ఆటోపాపులేషన్ విధానం అమల్లోకి వస్తుంది. పన్ను చెల్లింపుదారులు దానిలో సవరణలు చేయలేరు. పారదర్శకత, ఖచ్చితత లక్ష్యంగా ఈ మార్పులు జరుగుతున్నాయి.

జూలైలో ఎల్‌పీజీ ధరల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. వాణిజ్య సిలిండర్ ధరలు నెల మొదటివారంలో మారతాయి. జూన్‌లో 19 కిలోల సిలిండర్‌ ధర తగ్గింది. కానీ దేశీయ వినియోగదారులకోసం 14 కిలోల ఎల్‌పీజీ ధరలో గత ఆగస్టు నుంచీ మార్పుల్లేవు.

మొత్తం మార్పుల నేపథ్యంలో సాధారణ వినియోగదారులపై కొన్ని నిర్ణయాలు భారం పెంచేలా ఉంటే, కొన్ని ఊరట కలిగించేలా ఉన్నాయి. తత్కాల్ బుకింగ్‌లో ఏజెంట్లపై నియంత్రణ, పాన్-ఆధార్ లింకింగ్‌కు గడువు పొడగింపు వంటి నిర్ణయాలు ప్రయాణికులకు, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే అవకాశముంది. ఇదిలా ఉండగా, రైల్వే ఛార్జీల పెంపు, ATM లావాదేవీలపై చార్జీలు, BBPS ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు వంటి మార్పులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేయనున్నాయి.

ఇందులో భాగంగా సాధారణ ప్రజలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చే ఈ మార్పులను గమనించి, తమ ఆర్థిక వ్యూహాలను సవరించుకోవడం అవసరం. బ్యాంకింగ్, పన్నులు, ప్రయాణ ఖర్చులు, ఇంధన వినియోగంలో నియంత్రణ పాటించడమే కాకుండా ఆధునిక టెక్నాలజీ ఆధారిత మార్పులకు అలవాటు పడటం అనివార్యం కానుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!