దిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం – నోట్ల కట్టల కలకలం, వెంటనే బదిలీకి సుప్రీం కొలీజియం ఆదేశం

దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఆయన ఇంట్లో భారీగా లెక్కలో చూపని నోట్ల కట్టలు బయటపడటంతో వివాదం మరింత ముదిరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఘటన సమయంలో జడ్జి ఇంట్లో లేరు అనే సమాచారం వెలువడింది.

ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు, ఇంట్లో దొరికిన నగదు గురించి ఉన్నతాధికారులకు నివేదించారు. నోట్ల కట్టలు లెక్కలో చూపని డబ్బుగా భావిస్తున్నామని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ వ్యవహారం దేశ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయనున్నదని భావించిన సుప్రీంకోర్టు కొలీజియం, అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం, జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనిలో భాగంగా, ఆయనను దిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. జస్టిస్ వర్మ 2021 అక్టోబర్‌లో అలహాబాద్ హైకోర్టు నుంచి దిల్లీకి మారినట్లు సమాచారం.

ఈ ఘటనను కేవలం బదిలీతోనే ముగించకూడదని కొలీజియం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు జస్టిస్ వర్మను తన పదవికి రాజీనామా చేయాలని సూచించింది. ఆయన రాజీనామా చేయడానికి నిరాకరిస్తే, పార్లమెంటు ద్వారా ఆయనను తొలగించే చర్యలు చేపట్టాలని కొలీజియం నిర్ణయించింది.

ఈ ఉదంతం న్యాయవ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తుండగా, ఈ ఘటన మరింత దృష్టి ఆకర్షించింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ, తదితర అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!