తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి అందించడంతో పాటు భూసమస్యలు పరిష్కారంలో గ్రామ రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీతో పాటు పదోన్నతుల్లో వివక్ష చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తోనే తమ ఉద్యోగాలకు భద్రత లభిస్తుందని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం గ్రామ గ్రామాన ప్రజల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి, భాగస్వాములు అయిన వీఆర్వో వ్యవస్థనే రద్దు చేయడం దురదృష్టకమన్నారు.క్షేత్రస్థాయిలో వీఆర్వో వ్యవస్థకు ఎటువంటి ప్రత్యామ్నయం ఏర్పాటు చేయకుండ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లోని వీఆర్వో వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేస్తున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న సుమారు ఐదు వేల వీఆర్వో పోస్టులను ఒక్క కలం పోటుతో రద్దు చేసి, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఐదు వేల ఖాళీ పోస్టుల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయడంతో సుమారు 10 వేలకు పైగా ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేసే పోస్టులను రద్దు చేసి, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని అన్నారు.

గ్రామాల్లోని రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి, భూసమస్యలు పరిష్కరించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోయినప్పుడు, నష్టపరిహారం అంచనా వేయడంతో పాటు వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా నివేదిక రూపొందించి, పరిహారం సైతం పంపిణీ చేయటంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అర్హులను ఎంపిక చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేయటంలో ప్రధాన భూమిక పోషించడంలో కీలక పాత్ర పోషించిన వీఆర్వోల సేవలను మరోమారు క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పకడ్బందీగా అమలు కోసం వీఆర్వోల వ్యవస్థను పునరుద్ధరించి, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తగు చర్యలు చేపట్టగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ లో కోరినట్లు తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!