సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ – యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇలా సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ గారికి మార్చి 16, 2024 నాడు లేఖ రాయడం జరిగింది.

ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆలస్యం అయ్యింది. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసి మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. దీనిపై అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!