ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న ఏకైక నిజమైన సంపద అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కోర్టులో కేసు ఓడిపోయిన వ్యక్తి కూడా, న్యాయవ్యవస్థ తనతో న్యాయంగా వ్యవహరించిందనే నమ్మకంతో ఉండాలని అన్నారు.
దిల్లీలో జరిగిన రామ్ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసాల కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. తాను ఆశించిన తీర్పు రాలేదనే కారణంతో న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోకూడదని సూచించారు. అయితే విచారణ సమయంలో తమతో అన్యాయంగా వ్యవహరించారని ప్రజలు భావిస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని స్పష్టం చేశారు.
విమర్శలకు న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉండాలి
న్యాయవ్యవస్థపై విమర్శల అంశాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకానికి సంబంధించిన సుమోటో విచారణను ఉదాహరణగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ఒక సంస్థగా విమర్శలకు విముఖంగా ఉండదని గతంలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
న్యాయవ్యవస్థ పనితీరుపై నిష్పక్షపాతమైన, సమాచారంతో కూడిన, నిర్మాణాత్మక విమర్శలు చైతన్యవంతమైన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైనవే కాకుండా అవసరమైన అంశాలని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
స్వీయ దిద్దుబాటుకు విమర్శలు దోహదం
నిర్మాణాత్మక విమర్శలు న్యాయవ్యవస్థలో సంస్థాగత జవాబుదారీతనాన్ని పెంచుతాయని సీజేఐ అన్నారు. అలాగే లోపాలను గుర్తించి స్వీయ దిద్దుబాటు చేసుకునేందుకు కూడా ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే న్యాయమైన విచారణ, పారదర్శకత, జవాబుదారీతనం, విమర్శలను స్వీకరించే సంస్థాగత దృక్పథం అవసరమని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
![]()




