ఉత్తర్‌ప్రదేశ్ గ్రహ్‌ముక్తేశ్వర్‌లో బుధవారం చోటుచేసుకున్న విశేష సంఘటన బీమా మోసంపై పెద్ద ఎత్తున దృష్టిని సారించింది. హరియాణాకు చెందిన నలుగురు వ్యక్తులు గంగా ఘాట్‌కు అంత్యక్రియల పేరుతో ఒక శవాన్ని తీసుకుని వచ్చారు. అయితే వారి అనుమానాస్పద ప్రవర్తన స్థానికులను అప్రమత్తం చేసింది.
అంత్యక్రియల ముందు చేయాల్సిన ఆచారాలను విస్మరించి, నేరుగా చితిపై దహనం చేయాలని ప్రయత్నించడంతో స్థానికులు వారిని ఆపి విచారణకు దిగారు. శవంపై ఉన్న వస్త్రాన్ని తొలగించగా అది మనిషి శవం కాకుండా ప్లాస్టిక్ డమ్మీ అని బయటపడింది. వెంటనే మోసం అర్థమై, వచ్చిన నలుగురిలో ఇద్దరిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు.
తదుపరి విచారణలో నిందితులు మొదట “దిల్లీ ఆసుపత్రి పొరపాటున నిజమైన శవం బదులుగా డమ్మీని ఇచ్చింది” అనే అబద్ధం చెప్పారు. కానీ పోలీసులు కఠినంగా విచారించడంతో అసలు సంగతి బయటపడింది.
దిల్లీ కైలాస్‌పురికి చెందిన కమల్ సోమానీ రూ.50 లక్షలకు పైగా అప్పులు చేసుకున్నాడు. వాటి నుంచి తప్పించుకోవడానికి, ఉత్తమ్ నగర్‌కు చెందిన మిత్రుడు ఆశిష్ ఖురానాతో కలిసి భారీ బీమా మోసానికి పథకం వేసాడు. గతంలో తన వద్ద పనిచేసిన అన్షుల్ కుమార్ ఆధార్, పాన్ కార్డులు దొంగిలించి, అతని పేరుతో రూ.50 లక్షల జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం చెల్లిస్తూ, అన్షుల్ మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం కూడ తెచ్చుకున్నాడు.
తర్వాత నకిలీ శవంతో నకిలీ అంత్యక్రియలు చేసి బీమా క్లెయిమ్ పొందాలనే యత్నం చేశారు. పోలీసులు అన్షుల్‌ను సంప్రదించగా, అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు, తన పేరిట పాలసీ ఉన్న విషయం తెలియదని వెల్లడించాడు. దీంతో కమల్ సోమానీ, ఆశిష్ ఖురానా అరెస్టుకాగా, పరారీలో ఉన్న మరో ఇద్దరిపై గాలింపు కొనసాగుతోంది.
![]()
