ఏ దేశానికైనా స్వేచ్ఛ, సమగ్రతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేది ఆ దేశ జాతీయ జెండా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి అటువంటి అద్భుతమైన త్రివర్ణ పతాకాన్ని అందించి, కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని రగిలించిన మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్య. ఆగస్టు 2న ఆయన 150వ జయంతి (150th Birth Anniversary) సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రమను, త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతీ భారతీయుడి బాధ్యత.
ఆర్మీ సైనికుడి నుంచి జాతీయ జెండా రూపకర్త వరకు
పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు గ్రామంలో పింగళి హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరిన ఆయన, దక్షిణాఫ్రికాలో జరిగిన రెండవ బోయర్ యుద్ధంలో (1899-1902) పాల్గొన్నారు. ఆ సమయంలో బ్రిటిష్ సైనికులు తమ జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం గమనించిన వెంకయ్య మదిలో.. మన దేశానికి కూడా ఒక ప్రత్యేక జాతీయ జెండా ఉండాలన్న ఆకాంక్ష బలంగా నాటుకుపోయింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి: ఒక్కొక్క రంగానికి ఒక్కో పేరు!
పింగళి వెంకయ్య కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాక పలు రంగాల్లో అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన మేధావి. ఆయనలోని ప్రతిభకు నిదర్శనంగా వివిధ పేర్లు ప్రసిద్ధి చెందాయి:
- జపాన్ వెంకయ్య: లాహోర్‌లోని ఆంగ్లో-వేదిక్ కళాశాలలో చదువుకునే సమయంలో జపనీస్ భాషను అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవడంతో ఈ పేరు వచ్చింది.
- పత్తి వెంకయ్య: కాంబోడియా నుంచి ప్రత్యేక విత్తనాలను తెప్పించి, మునగాల పరగణాలో సంకరజాతి పత్తిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసి వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందించారు.
- డైమండ్ వెంకయ్య: వజ్రకరూర్ లో దొరికే వజ్రాల స్వచ్ఛత, రకాలపై సుదీర్ఘ పరిశోధన చేసి ‘డైమండ్స్’ పై ప్రామాణిక గ్రంథం రాయడంతో ఈ పేరు స్థిరపడింది.
- జెండా వెంకయ్య: భారతీయులందరినీ ఏకం చేసిన త్రివర్ణ పతాక రూపకర్తగా ‘జెండా వెంకయ్య’గా చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఐదేళ్ల సుదీర్ఘ శ్రమ.. త్రివర్ణ పతాక ఆవిర్భావం
1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో బ్రిటిష్ జెండాను ఎగరవేస్తుండటం చూసి చలించిపోయిన వెంకయ్య, భారతీయులకు స్వతంత్ర పతాకం ఉండాలని నిశ్చయించుకున్నారు. సుమారు 30కి పైగా వివిధ దేశాల జాతీయ జెండాలను లోతుగా అధ్యయనం చేసి, “A National Flag for India” అనే పరిశోధనాత్మక పుస్తకాన్ని ప్రచురించారు.
తర్వాత 1921లో విజయవాడ (బెజవాడ)లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్యను పతాకాన్ని రూపకల్పన చేయాల్సిందిగా మహాత్మా గాంధీ కోరారు. గాంధీజీ సూచన మేరకు శాంతికి చిహ్నంగా పతాకంలో తెలుపు రంగును చేర్చారు. ఆ తర్వాత 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ కొన్ని చిన్న మార్పులతో (రాట్నం స్థానంలో అశోక చక్రం) ఈ త్రివర్ణ పతాకాన్ని భారతదేశ అధికారిక జాతీయ జెండాగా ఆమోదించింది.
మహనీయుడికి నివాళి
దేశానికి ఐడెంటిటీగా నిలిచే అద్భుత జెండాను అందించిన పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తుగా 2009లో భారత ప్రభుత్వం రూ. 5 ప్రత్యేక తపాలా బిళ్లను (Postal Stamp) విడుదల చేసింది. ఈ రోజు ఆయన 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్ఫూర్తిని, దార్శనికతను భారతావని సగర్వంగా స్మరించుకుంటోంది.
![]()




