న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాలపై వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి అత్యవసరంగా సమావేశమయ్యారు. SIR సహా పలు అంశాలపై కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
విభేదాలపై ఈసీ వివరణ
ఎన్నికల సంఘంలో 10 నెలల వ్యవధిలో పలు అంశాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలపై ఈసీ స్పందించింది. SIRతో సహా అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది. అభ్యంతరాలు, సూచనలు సాధారణ నిర్ణయ ప్రక్రియలో భాగమేనని పేర్కొంది.
SIR నోటీసులపై కీలక వెసులుబాటు
ఇదిలా ఉండగా, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)లో నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణ కోసం తప్పనిసరిగా బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. అత్యవసర పరిస్థితులు మినహా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఓటర్లకు అవసరమైన సహాయం అందించే బాధ్యత BLOలదేనని ఈసీ పేర్కొంది. అలాగే SIRకు సంబంధించిన నోటీసులకు సమాధానాలు, అవసరమైన పత్రాల సమర్పణకు ఈసీ పౌర సేవా పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంది. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా SIR ప్రక్రియను నిర్వహించడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
![]()




