సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
సమర్‌ఖండ్: న్యాయవ్యవస్థలో డిజిటలైజేషన్, కృత్రిమ మేధ (AI) వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అయితే సాంకేతిక పరివర్తనలో రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విలువలు ఏమాత్రం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని స్పష్టం చేశారు.
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగిన ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్స్ (AACC) 7వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.
కేసుల జాప్యానికి డిజిటలైజేషన్‌తో చెక్
సమాజం, ప్రభుత్వ పాలన, వ్యాపార వ్యవహారాలు, ప్రజల జీవన విధానాలు సాంకేతిక విప్లవంతో వేగంగా మారుతున్నాయని సీజేఐ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు కూడా సాంకేతిక మార్పులకు దూరంగా ఉండలేవన్నారు.
కోర్టుల డిజిటలైజేషన్ ద్వారా కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించడంతో పాటు న్యాయ ప్రక్రియలను మరింత సులభతరం చేయవచ్చని తెలిపారు. దీంతో సామాన్యులకు న్యాయం మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు.
న్యాయ పరిశోధనలో ఏఐ కీలకం
భారీ మొత్తంలో సమాచారాన్ని నిర్వహించడం, చట్టపరమైన పరిశోధనలు చేయడం వంటి అంశాల్లో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి ఏఐ సాంకేతికత గణనీయంగా ఉపయోగపడుతుందని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఏఐ అందించే అవకాశాలను సృజనాత్మకంగా స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే సాంకేతికత వేగంగా మారుతున్న సమయంలో “ఏవి మారాలి.. ఏవి ఎప్పటికీ మారకూడదు?” అనే మౌలిక ప్రశ్నను గుర్తుంచుకోవాలని సూచించారు.
మానవ గౌరవం, సమానత్వం కాపాడాలి
సాంకేతిక పరివర్తనలో మానవ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, నిష్పాక్షికత వంటి రాజ్యాంగ విలువలను న్యాయస్థానాలు నిరంతరం కాపాడాలని సీజేఐ స్పష్టం చేశారు.
కోర్టులు కేవలం కేసులను పరిష్కరించే వేదికలు మాత్రమే కాదని, న్యాయవ్యవస్థలో మానవీయ కోణాన్ని, ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉందన్నారు. కొత్త సాంకేతికతలను సమర్థంగా వినియోగించుకుంటూనే న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
![]()




