📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,454  |  573 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదం
జాతీయం - National ⚡ AMP

డే కేర్, ప్లే స్కూల్స్‌లో చిన్నారులపై అమానుషాలు: పిల్లల భద్రతకు గ్యారంటీ ఎక్కడ?

July 4, 2026 July 4, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

(బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ రావు ప్రత్యేక విశ్లేషణ)

ఉద్యోగ రీత్యా ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేటి తల్లిదండ్రులకు తమ పిల్లల భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. బెంగుళూరులో రెండు సంవత్సరాల పసిపాపపై జరిగిన అమానుష ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. పాప ఏడుస్తోందనే నెపంతో వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్‌తో నోట్లోకి నీళ్లు స్ప్రే చేయడం, బాత్రూమ్‌లో బంధించడం వంటి వికృత చేష్టలకు ఒడిగట్టిన ఐదుగురు ఆయాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ (JJ Act) తో పాటు, భారతీయు న్యాయ సంహిత (BNS) సెక్షన్ 351 (క్రిమినల్ ఇంటిమిడేషన్) కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లోని డే కేర్ సెంటర్లు, ప్లే స్కూల్స్ అసలు ఎంతవరకు సురక్షితం? ప్రభుత్వం ఏం చేస్తోంది? అనే అంశాలపై ప్రత్యేక విశ్లేషణ:

గుర్తింపు లేని కేంద్రాలు.. వెంటాడుతున్న ప్రమాదాలు

హైదరాబాద్ వంటి మహానగరాల్లో దాదాపు ఐదు వందలకు పైగా ప్లే స్కూల్స్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండానే ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా ఘోరం జరిగే వరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని భయానక సంఘటనలు ఇందుకు నిదర్శనం:

  • ఒక ప్లే స్కూల్లో రెండు సంవత్సరాల పాపకు చపాతీ తినిపిస్తున్న సమయంలో అది గొంతులో అడ్డం పడి, ఊపిరి ఆడక చనిపోయింది. ఆయా నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం.
  • డిసెంబర్ 2025 లో జీడిమెట్లలో నాలుగు సంవత్సరాల పాప ఏడుస్తోందని ఆయా అమానుషంగా కొట్టి రోడ్డుపై వదిలేసింది.
  • మల్కాజిగిరి పరిధిలో మూడు సంవత్సరాల బాబు ఆడుకుంటూ వెళ్లి, నిర్లక్ష్యంగా తెరిచి ఉంచిన సంపు (Sump) లో పడి ప్రాణాలు కోల్పోయాడు.
  • ఆగస్టు 2025 లో రంగారెడ్డి జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు బాబు అల్లరి చేస్తున్నాడని నోటికి ప్లాస్టర్ వేసి, పెన్‌తో కంటి దగ్గర గుచ్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.ఇలాంటి ఘటనల వెనుక యాజమాన్యాల బాధ్యతారాహిత్యం, డబ్బు సంపాదనే ధ్యేయంగా నడపడం స్పష్టంగా కనిపిస్తోంది.

తల్లిదండ్రులు – ప్లే స్కూల్ ఎంచుకునే ముందు ఇవి చెక్ చేసుకోండి

మీ పిల్లలను డే కేర్ లేదా ప్లే స్కూల్స్‌కు పంపే ముందు తల్లిదండ్రులు కొన్ని ప్రాథమిక విషయాలను ఖచ్చితంగా పరిశీలించాలి:

  • ప్రభుత్వ గుర్తింపు: సదరు విద్యా కేంద్రానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అనేది ముందే ధృవీకరించుకోండి.
  • పోలీస్ వెరిఫికేషన్: అక్కడ పనిచేసే ఆయాలు, సిబ్బంది శిక్షణ పొందిన వారేనా? వారికి పోలీస్ వెరిఫికేషన్ (Police Verification) చేయించారా లేదా అని యాజమాన్యాన్ని అడగండి. కేవలం డబ్బు కోసమే కాకుండా, పిల్లలను ప్రేమతో చూసుకునే తత్వం (Passion) ఉన్న సెంటర్లను ఎంచుకోండి.
  • లైవ్ సీసీటీవీ లింక్: ప్లే స్కూల్లో ఏం జరుగుతుందో మీ మొబైల్‌లోనే చూసుకునేలా CCTV Live Link సౌకర్యం ఉండాలి. ఒకవేళ లింక్ ఇవ్వడానికి నిరాకరిస్తే, అక్కడ ఏదో లోపం ఉందనే విషయాన్ని గ్రహించాలి. (కొన్ని కేంద్రాల్లో పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి దగ్గు మందు ఇచ్చి పడుకోబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి).
  • పిల్లల ప్రవర్తన గమనించండి: ప్రతిరోజూ పసిపిల్లలను ఇంటికి తీసుకురాగానే వారి ఒంటిపై ఎక్కడైనా గాయాలు, వాతలు ఉన్నాయేమో చెక్ చేయండి. వారి ప్రవర్తనలో మార్పులని గమనించండి. రోజూ ప్రేమగా దగ్గరకు తీసుకుని స్కూల్లో ఏం జరిగిందో మాట్లాడటం అలవాటు చేసుకోండి.

ప్రభుత్వాలు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు

చిన్నారి జీవితాన్ని మార్చే ఇలాంటి నిర్లక్ష్యాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి:

  • విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు ప్రతి డే కేర్ సెంటర్, ప్లే స్కూల్‌పై నిరంతర ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అనుమతి లేని కేంద్రాలను తక్షణమే సీజ్ చేయాలి.
  • ప్రతి కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేయాలి.
  • అనుమతులు ఇచ్చే సమయంలోనే స్కూల్ ప్రాంగణంలో సంపులు (Sumps) పూర్తిగా మూసి ఉన్నాయా, పిల్లలు ఆడుకోవడానికి సురక్షితమైన ఆటస్థలం ఉందా లేదా అనేది భౌతికంగా తనిఖీ చేయాలి.

ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం చట్టప్రకారం వారి హక్కు. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా బాధ్యత వహించాలి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!