న్యూఢిల్లీ: దేశ న్యాయ వ్యవస్థ బలం న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయకోవిదులు, పరిపాలకుల నాణ్యతతో పాటు వారు అనుసరించే విలువలపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయశాస్త్రాన్ని వృత్తిగా ఎంచుకునే ప్రతి తరానికి దిశానిర్దేశం చేసిన అధ్యాపకుల తరం వెనుక ఉంటుందని ఆయన అన్నారు.
‘చట్టం, న్యాయం, న్యాయ విద్య’పై ఉపన్యాసాలు
సుప్రీంకోర్టులో ‘చట్టం, న్యాయం, న్యాయ విద్య’ అంశంపై నెలవారీ ఉపన్యాసాల పరంపరను బుధవారం సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ చట్టాల్లో వస్తున్న మార్పులు, పరిణామాలను నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హక్కులతో పాటు బాధ్యతలు కూడా
రాజ్యాంగాన్ని సాధారణంగా హక్కులు, అధికార పరిమితులు, పరిపాలనా వ్యవస్థలను వివరించే పత్రంగా చూస్తుంటామని సీజేఐ అన్నారు. అయితే వ్యక్తులు సమాజంలో అర్థవంతమైన భాగస్వాములుగా మారేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించడం, తమకు లభించిన అవకాశాలను గౌరవప్రదంగా, సమానంగా వినియోగించుకోవాలనే నిబద్ధతను కూడా రాజ్యాంగం నిర్దేశిస్తుందని వివరించారు.
గురువుకు ప్రత్యేక గౌరవం
ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రణ్‌బీర్ సింగ్‌కు తొలి ‘సుప్రీంకోర్టు న్యాయ శిక్షా సమ్మాన్’ అవార్డును సీజేఐ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ రణ్‌బీర్ సింగ్‌ను తన గురువుగా సీజేఐ అభివర్ణించారు. చట్టపరమైన నిబంధనలు నిరంతరం పరిణామం చెందుతున్న నేపథ్యంలో కొత్త ప్రశ్నలు, సవాళ్లు ఎదురవుతున్నాయని సీజేఐ పేర్కొన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ విద్యావేత్తలు నిరంతరం నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ రాయ్ తదితరులు ప్రసంగించారు.
![]()




