📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, September 23, 2026
Visitors: 9,564  |  818 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్ప్రేమపెళ్లిళ్లను నిషేధిస్తూ గ్రామసభ తీర్మానంతీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘంLatest Breaking News from PressMeetతాజా వార్తలురిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్ప్రేమపెళ్లిళ్లను నిషేధిస్తూ గ్రామసభ తీర్మానంతీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘం

తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్

September 23, 2026 17 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

విశాఖ–గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం.. గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం రాత్రికి ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశా తీరంలో విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

గంటకు 50–60 కి.మీ వేగంతో గాలులు

తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పలాసలో 100.75 మి.మీ వర్షం

మంగళవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 100.75 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గంపరాయిలో 73, విశాఖపట్నం జిల్లా మధురవాడలో 69.5, నంద్యాల జిల్లా కనాలలో 65.91, విజయనగరం జిల్లా భోగాపురంలో 62.9, అనకాపల్లి జిల్లా పరవాడలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది.

సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నంద్యాల జిల్లా పాములపాడులో 98.75 మి.మీ, శ్రీకాకుళం జిల్లా విజయరామపురంలో 90.5, చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో 88.5, పల్నాడు జిల్లా గండివేములలో 78.81 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్

అత్యంత భారీ వర్షాల ముప్పు నేపథ్యంలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేశారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

మూడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

అత్యంత భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల పరిస్థితిని బట్టి స్థానికంగా మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అధికారుల అప్రమత్తం

ఉత్తర కోస్తాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జలవనరులశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. మంగళవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై సమీక్షించారు.

వాయుగుండం తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. కుంచనపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు.

తోటపల్లి కాలువలో యువకుడు గల్లంతు

పార్వతీపురం మన్యం జిల్లా ఏగోటివలసలోని తోటపల్లి కాలువలో స్నానానికి దిగిన హేమంత్‌కృష్ణ (39) గల్లంతయ్యాడు. వర్షాల నేపథ్యంలో కాలువలు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గన్నవరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్

వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడిని ఉపగ్రహ ఆధారంగా గుర్తించి రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత కాల్ సెంటర్‌లో ఎల్‌నినో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వాతావరణ పరిస్థితులు, నీటి వనరులపై సమాచారాన్ని సమన్వయం చేసేందుకు ఈ కేంద్రాన్ని వినియోగించనున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *