అల్లూరి జిల్లాలో ఘోర విషాదం: ఘాట్‌రోడ్డులో లోయలో పడ్డ బస్సు

TwitterWhatsAppFacebookTelegramShare

ప్రెస్ మీట్ రిపోర్టర్ ప్రసాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ప్రాంతంలో విషాదం నెలకొంది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ పర్యాటక బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మొదటి సమాచార ప్రకారం 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద స్థలానికి వెంటనే చింతూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అంబులెన్స్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్‌కు అకస్మాత్తుగా స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రదేశం లోతైన అడవి ప్రాంతం కావడంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారాయి. పోలీసులు క్రేన్‌లు, వ్యాలీ రెస్క్యూ టీమ్స్ సహాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మరణించిన వారిలో పర్యాటకులు, స్థానిక ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డు ప్రాంతంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లను పునర్విమర్శించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

ఘోర విషాదం: ఘాట్‌రోడ్డులో  లోయలో పడ్డ బస్సు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version