“తెలంగాణ తల్లి” విగ్రహ ఆవిష్కరణ: రాష్ట్ర చరిత్రలో శాశ్వత ఘట్టం – సీఎం రేవంత్ రెడ్డి

TwitterWhatsAppFacebookTelegramShare

ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

♦️ తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు.

♦️ డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ…

♦️ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు తెలంగాణ తల్లి రూపం ఇలా ఉండాలని గానీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయాలని గానీ ఏ రోజూ ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

♦️ తెలంగాణ సాకారమైన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయని ఆశించాం. మన సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది. మన తల్లిని గౌరవించుకుంటామని ఆశించాం.

♦️ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు యువకులు తాము నడిపే వాహనంపై టీజీ అని రాసుకోవడమే కాకుండా గుండెలపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీజీ అని మార్చాం.

♦️ తెలంగాణ ఉద్యమ కారులకు స్ఫూర్తినిచ్చి నిలబడ్డ అందేశ్రీ గారి గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య పాలనలో ఎన్నోసార్లు చెప్పుకున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక అది జరగలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గేయాన్ని అధికారిక గేయంగా ప్రకటించుకున్నాం.

♦️ కవి గూడ అంజయ్య, ప్రజా కవి గద్దర్, బండి యాదగిరి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పైడి జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి లాంటి ఎందరో తెలంగాణ ప్రముఖులను లేదా వారి కుటుంబాలను సన్మానించాలని నిర్ణయించాం. వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల చొప్పున స్థలంతో పాటు కోటి రూపాయల నగదు, తామ్రపత్రం బహుమతిగా అందజేస్తాం.

♦️ ప్రతి ఏటా తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్న రోజును (డిసెంబర్ 9 న) ఒక పండుగలా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తాం.

♦️భవిష్యత్తులో తెలంగాణ తల్లి నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని ప్రయత్నం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

♦️ ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తో పాటు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అదికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version